ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలులోకి రానుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం వైపు దృష్టి సారిస్తూనే పారదర్శక పాలన అందించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం నేటినుంచి అమలు చేయనుంది.
డిజిటల్ విధానంలో నామమాత్రపు రుసుముల చెల్లింపులు ఈ విధానంలో సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్రపు రుసుములను నేరుగా కాకుండా డిజిటల్ విధానంలో స్వీకరించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానంలో చోటు చేసుకున్న అవకతవకల నేపథ్యంలో తమ పాలనలో ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా పక్కా ప్రణాళికతో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
పారదర్శకంగా ఇసుక విధానం అమలుకు ప్రయత్నం ఎటువంటి నగదు లావాదేవీలకు ఆస్కారం లేకుండా డిజిటల్ చెల్లింపుల ద్వారా మాత్రమే నామమాత్రపు రుసుములను స్వీకరిస్తూ అత్యంత పారదర్శకంగా ఈ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక దొరకక ప్రజలు పడిన ఇబ్బందులు,నిర్మాణరంగ కార్మికుల కష్టాలు గుర్తించిన ప్రభుత్వం ఆ పరిస్థితులు మళ్లీ రాకుండా జాగ్రత్తపడుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా మొదట అమలు ఈ జిల్లాలలోనే రాష్ట్రవ్యాప్తంగా కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, పార్వతీపురం మన్యం, కృష్ణ, అనంతపురం మినహా మిగతా 20 జిల్లాలలోనూ ఇసుక డంపు నిల్వ కేంద్రాల వద్ద ఈ ఉచిత ఇసుక విధానాన్ని తొలుత అమలు చేయనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాలను డిజిటల్ చెల్లింపులు స్వీకరణ కోసం బ్యాంకు ఖాతాలను తెరిచారు నేడు ఆయా బ్యాంకులు వారికి క్యూఆర్ కోడ్ల ద్వారా చెల్లింపులకు మార్గాన్ని సుగమం చేయనున్నారు.
ఇసుక అందుబాటుపైనా పారదర్శక విధానం ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి అన్నది, వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉంది అన్న వివరాలను కూడా గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు ఏరోజుకారోజు జరిగిన ఇసుక లావాదేవీలు, మిగిలిన నిలువలు సమాచారాన్ని అప్డేట్ చేసి ప్రజలకు తెలిసేలా ఉంచనున్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీని నేరవేర్చనున్న ఏపీ ప్రభుత్వం ఇక నేటి నుంచి రెండు వారాలపాటు మ్యానువల్ గా వే బిల్లులు జారీ చేస్తారు. ఆ తరువాత వే బిల్లులను కూడా ఆన్లైన్ విధానంలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం గృహ నిర్మాణాలకు ఉచిత ఇసుకను అందించనుంది. అంతేకాదు ఉచిత ఇసుక అమలు విధానానికి నేడు ఉత్తర్వులతో కూడిన మార్గదర్శకాలను వెలువరించి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చబోతోంది.