తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ తెలంగాణ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నంలో ఉంది.
మహిళల ఆర్ధిక స్వావలంబనకు మహిళా శక్తి పథకం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి హామీ ఇచ్చిన మేరకు అనేక సంక్షేమపథకాలను మహిళల కోసం అమలు చేస్తుంది. మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించటంతో పాటు, ఇదే పథకం కింద రాష్ట్రంలోని ఒక్కొక్క మహిళ అకౌంట్లో 2500రూపాయలు జమ చేసేందుకు రెడీ అవుతుంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళాశక్తి పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది రేవంత్ సర్కార్.
పౌల్ట్రీ ఫారాలు, పాడి పశువుల యూనిట్లు ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలకు, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ మహిళలు వీటిని ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకులు, స్త్రీనిధి మండల మహిళా సమాఖ్య ద్వారా రుణాలను ఇవ్వడానికి కూడా నిర్ణయించింది.
పాడిపశువుల యూనిట్ లకు ఆర్ధిక మద్దతు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలలో అర్హులైన వారిని ఈ యూనిట్ల కోసం ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మహిళా శక్తి పథకంలో భాగంగా పాడి పశువుల పెంచాలనే వారికి ప్రతి జిల్లాకు 4.5 కోట్లతో 500 మంది మహిళా సమాఖ్యల సభ్యురాళ్లకు యూనిట్లను మంజూరు చేయనున్నారు. 90 వేల ఆర్థిక సహాయంతో ఒకటి లేదా రెండు పశువులను ఒక్కొక్క సభ్యురాలికి అందిస్తారు.
కోళ్ళ ఫారాలకు ఆర్ధిక బాసట కోళ్ల ఫారాలకు ప్రతి జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున యూనిట్ మంజూరు చేయనున్నారు. కోళ్ల ఫారాలకు ఒక్కో యూనిట్కు 2.91 లక్షల చొప్పున రుణాలను ఇచ్చి ప్రోత్సహిస్తారు. సొంత స్థలం ఉండి షెడ్లు వేసుకుని కోళ్ల ఫారం ఏర్పాటు చేసే వారికి ఈ పథకంలో అవకాశం కల్పిస్తారు.
మిల్క్ పార్లర్ ల కోసం ఆర్ధిక సహాయం ఇక నాటు కోళ్ల పెంపకానికి 20, 50 లేదా 100 దేశవాళీ కోళ్లను కొనుగోలు చేయడానికి మహిళలకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. నాటు కోళ్ల పెంపకం యూనిట్లను ఒక్కో జిల్లాలో మూడు కోట్లతో 2000 మందికి ఇవ్వనున్నారు. మిల్క్ బూతులు నిర్వహించే వారికి ఒక్కో మిల్క్ పార్లర్ కు 1 . 90 లక్షలు చొప్పున రుణాలను ఇస్తారు. ఇవి కూడా ప్రతి జిల్లాలోనూ మండలానికి ఒకటి చొప్పున మంజూరు చేస్తారు.
చేపల విక్రయ కేంద్రాల ద్వారా ఆర్ధిక వెన్నుదన్ను ఇక చేపల విక్రయ కేంద్రాలకు ఒక్కో యూనిట్ కు పది లక్షల రూపాయల చొప్పున మండలానికి ఒక యూనిట్ చొప్పున ఇస్తారు. ఇక ఈ మహిళా శక్తి పథకం ద్వారా ఇచ్చే వివిధ యూనిట్ల ద్వారా లబ్ధి పొందాలనుకునే మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలనుకుంటున్న మహిళలు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.