ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రాన్ని విడుదల చేయడం ద్వారా వివరించారు. ఇటీవల ఎన్నికలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చేపట్టిన వారంలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పరిస్థితిని అధికారులను, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ హయాంలో యజ్ఞంలా సాగిన పోలవరం పనులు ఐదేళ్లపాటు పోలవరం ప్రాజెక్టుని జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని చంద్రబాబు గుర్తించారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పైన నేడు శ్వేత పత్రం విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగాయని, అప్పట్లో ఉన్న సమస్యలను అధిగమించి ఎప్పటికప్పుడు ముందుకు వెళ్లామని గుర్తు చేసిన చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సాధించిన విజయాలను గుర్తు చేశారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పోలవరానికి నాడు స్థానం ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్ లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి నాటి ప్రభుత్వం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిందని కూడా చంద్రబాబు గుర్తు చేశారు. నాడు కేంద్ర మంత్రులు పోలవరం ప్రాజెక్టును సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుల్లో ప్రతి నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశామని, టిడిపి హయాంలోనే 72% పనులు పూర్తయ్యాయని చంద్రబాబు సవివరంగా వాటిని గుర్తు చేశారు.
రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం నాశనం ఇక ఇదే సమయంలో వైసీపీ పై విరుచుకుపడిన చంద్రబాబు గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు విషయంలో తప్పుడు నిర్ణయాలు రివర్స్ టెండర్ల డ్రామాలు ప్రాజెక్టుకు నష్టం చేశాయన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో జగన్ గా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రోజే పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ తర్వాత రివర్స్ టెండర్ల డ్రామా ఆడారని రిజర్వ్ టెండర్లకు పాల్పడ్డారన్నారు.
డయాఫ్రమ్ వాల్ దెబ్బ తీశారు ఫలితంగా పోలవరం ప్రాజెక్టును జగన్ సర్కార్ దెబ్బతీసింది అని చంద్రబాబు మండిపడ్డారు. పనులు చేస్తున్న సంస్థను కాదని ఆధారాలు లేని ఆరోపణలు చేసి కాంట్రాక్టర్ ను మార్చడం వల్ల పోలవరంలో మరింత జాప్యం జరిగిందని ఆయన అన్నారు. రివర్స్ టెండర్ల ద్వారా 738 కోట్లు ఆదా చేశామని చెప్పారని, కానీ చివరకు డయాఫ్రమ్ వాల్ ను దెబ్బతీశారని చంద్రబాబు విచారణ వ్యక్తం చేశారు.
పోలవరానికి శాపంగా జగన్ పోలవరం ప్రాజెక్టుకు జగన్ శాపంగా మారారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇది తెలుగు జాతికి జరిగిన నష్టమని, రాష్ట్రానికి నష్టం చేసే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్న చంద్రబాబు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి అంటూ హితవు పలికారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేయలేమని అటువంటి ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు లెక్కలతో సహా వివరణ ఇచ్చారు.









