UPDATES  

NEWS

 అమరావతి నిర్మాణ నిధుల కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వంలో అమరావతి – పోలవరం తన ప్రాధాన్యత అంశాలుగా చంద్రబాబు వెల్లడించారు. అమరావతి తొలి విడత నిర్మాణాల కోసం రూ 38 వేల కోట్లు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. కేంద్రం నుంచి రాజధాని కోసం నిధులు ఆశించిన స్థాయిలో వచ్చే ఛాన్స్ లేదని భావిస్తున్నారు. దీంతో, సొంతంగా నిధుల సమీకరణ కోసం కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు.

 

నిర్మాణానికి నిధులు అమరావతి నిర్మాణం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో.. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుండి నిధుల సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకుని ఉండటంతో, మళ్లీ వాటినుండే నిధుల సమీకరణ దాదాపుగా సాధ్యం కాదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో ప్రత్యామ్నాయంగా ప్రైవేటు పెట్టుబడుల అంశం ముందుకు వచ్చింది. నిధుల సమీకరణలో ఎన్‌ఆర్‌ఐలకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. వారి సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.

 

నారాయణకు బాధ్యతలు అదే సమయంలో సింగపూర్‌, అమెరికాతో పాటు పలు ఇతర దేశాలకు చెందిన సంస్థలతో కూడా చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు రాజధాని ప్రాంతంలో తమ కార్యాలయాలను ప్రారంభించాల్సిందిగా పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను కోరాలని నిర్ణయించింది. ఈ రెండిటికోసం పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఒక కమిటీని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయనున్నారు. గతంలోనే అమరావతిలో ఎపిఎన్‌ఆర్‌టి భవనానికి రాయపూడి వద్ద స్థలం కేటాయించారు. దాని ద్వారా కూడా ఇప్పుడు నిధుల సేకరణపై దృష్టి సారించినట్లు తెలిసింది.పెట్టుబడులకు సంబంధించిన కంపెనీల వివరాలను ఇప్పటికే సిఆర్‌డిఏ సిద్ధం చేసింది.

 

అధికారుల నివేదిక రాజధాని ప్రాంతంలో పస్తుతం ఉన్న పరిస్థితులపై మరో పదిరోజుల్లో సిఆర్‌డిఏ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం నిధుల కోసం వేట ప్రారంభించనున్నట్లు తెలిసింది. అమరావతి రాజధాని ప్రాజెక్టుకు కనీసం రూ.43 వేల కోట్ల అవసరం ఉంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికిరూ.15 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లకు పిలిచారు. వీటిల్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని పూర్తయ్యాయి. కొన్ని మధ్యలో నిలిచిపోయాయి. ఇప్పుడు అమరావతిలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా, కొత్త పనులు ప్రారంభించాలన్నా కనీసం రూ.10 వేల కోట్ల అవసరం ఉంటుందని భావిస్తున్నారు. ఈ మొత్తం పైన పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తరువాత ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోనేలా అడుగులు వేస్తోందని సమాచారం.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |