ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యంత్రి చంద్రబాబు అమరావతి సందర్శించారు. రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసారు. మూడు రాజధానుల ప్రకటన నుంచి నిరసనలు చేస్తున్న అమరావతి రైతులు మరోసారి పాదయాత్ర చేస్తున్నారు. తిరిగి అమరావతిలో రాజధాని నిర్మాణాల దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో, తమ ఉద్యమ ఆకాంక్ష నెరవేరటంతో అమరావతి రైతులు తాజాగా పాదయాత్ర ప్రారంభించారు.
ఫలించిన నిరీక్షణ రాజధాని రైతుల చిరకాల కోరిక నెరవేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొక్కులను తీర్చుకుంటామని రైతులు ప్రకటించారు. అమరావతి ఉద్యమ ఆకాంక్ష నెరవేరడంతో రాజధాని గ్రామాల రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు పాదయాత్రగా బయల్దేరివెళ్లారు. తుళ్లూరు శిబిరం నుంచి కాలినడకన కనకదుర్గమ్మ ఆలయానికి బయల్దేరారు. అమ్మవారికి పొంగళ్లు, చీర-సారె సమర్పించనున్నారు.
అమ్మవారికి మొక్కులు ఉదయం పాదయాత్రగా వెళ్లిన రైతులు, తుళ్లూరు శిబిరం నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకోనున్నారు. అమ్మవారికి సారె సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఉద్యమ సమయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు బయలుదేరగా పోలీసులు తమపై లాఠీలు ఝుళిపించారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే అమ్మవారికి మొక్కుకున్నామని మహిళలు తెలిపారు.
రాజధానిలో కదలిక తమ కోరిక నెరవేరటంతో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు బయలుదేరామని మహిళలు చెప్పారు. రాజధాని పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని అమ్మవారికి మొక్కుకుంటామని మహిళలు తెలిపారు. ఇక, రాజధాని నిర్మాణం పైన రేపు (సోమవారం) జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. తొలి విడత పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.









