UPDATES  

NEWS

 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి: అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లుకు కేటీఆర్ సిద్ధం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు పెంచారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ఈ మేరకు ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే సంతకం చేసిన ఆరు గ్యారెంటీల ఫైలు ప్రస్తుతం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ బిల్లు చట్టంగా మారితే మహిళలకు అందాల్సిన రూ. 2,500 మహాలక్ష్మి పథకం, రైతులకు రూ. 15,000 రైతు భరోసా మరియు విద్యార్థులకు విద్యా భరోసా వంటివి ప్రజల హక్కుగా మారుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిధుల్లేవనే సాకుతో వీటిని ఎగ్గొట్టే అవకాశం ఉండదని, ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు తెచ్చిన ప్రైవేట్ బిల్లులను ఆమోదించిన చరిత్ర ఉందని, ప్రస్తుత స్పీకర్ కూడా తమ బిల్లుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఆరు గ్యారెంటీల్లో కనీసం ‘అర’ గ్యారెంటీ కూడా సరిగ్గా అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను వంచిస్తోందని, వారి మోసాలను ఎండగట్టేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం తమ బిల్లుపై సానుకూలంగా స్పందించకపోతే ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |