UPDATES  

NEWS

 తెలంగాణలో ఆటోల ‘రెట్రో ఫిటింగ్’: పాత ఇంజిన్ల స్థానంలో ఎలక్ట్రిక్ కిట్లు

హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కింద నగరంలోని సుమారు 1.25 లక్షల ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిశ్చయించింది. ఈ ప్రక్రియలో భాగంగా పాత పెట్రోల్, డీజిల్ ఇంజిన్లను తొలగించి వాటి స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ కిట్లను అమర్చే ‘రెట్రో ఫిటింగ్’ పద్ధతిని అమలు చేయనున్నారు. దీనివల్ల డ్రైవర్లకు పెట్రోల్, డీజిల్ ఖర్చులతో పాటు మెయింటెనెన్స్ భార కూడా పూర్తిగా తగ్గుతుంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తొలి విడతగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా రూ. 200 కోట్లను కేటాయించింది. ఆటో డ్రైవర్లపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, ఈ మార్పిడికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించనుండటం విశేషం. ప్రస్తుతం మార్కెట్‌లో బ్యాటరీ స్వాపింగ్ సిస్టమ్ కోసం రూ. 1.20 లక్షలు, ఫిక్స్‌డ్ బ్యాటరీ సిస్టమ్ కోసం రూ. 2 లక్షల వరకు వ్యయం అవుతుందని అంచనా. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఉచితంగా కిట్లను అందించి వారి జీవనోపాధిని మెరుగుపరచాలని సర్కార్ భావిస్తోంది.

మొత్తం నగరంలోని ఆటోలన్నింటినీ ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి దాదాపు రూ. 1,500 కోట్ల నుండి రూ. 2,500 కోట్లు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత నిధులతో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడేళ్లు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, కాలుష్యాన్ని ఎక్కువగా విడుదల చేసే పాత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తే ఐదేళ్లలోనే లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావిస్తున్నారు. సీఎన్జీ, ఎల్‌పీజీ ఆటోలను మినహాయించి, మిగిలిన వాటిని త్వరగా మార్చడం ద్వారా హైదరాబాద్‌ను ‘గ్రీన్ సిటీ’గా మార్చడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |