UPDATES  

NEWS

 రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్ కుట్ర..నకిలీ వీడియోల తయారీలో బిజీ : పీఎం మోదీ..

రిజర్వేషన్లపై ఇండియా కూటమి కుట్రలను ఓ పార్టీ నేత బయట పెట్టారని ప్రధాని మోదీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని బీద్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు. పశుగ్రాస కుంభణంలో దోషిగా ఉన్న ఓ నేత రిజర్వేషన్లపై మాట్లాడుతూ ఇండియా కూటమి కుట్రను అంగీకరించినట్లు తెలిపారు.

 

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రయత్నిస్తోందని ఆ నేత అన్నట్లు మోదీ తెలిపారు. నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేనలు కాంగ్రెస్ తో జతకట్టాయని ఎద్దేవా చేశారు. కూటమి నేతలు అమలు కాని హామీలిస్తూ..నకిలీ వీడియోలు తయారు చేయడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజల కోసం ఆలోచించకపోగా.. ప్రజల కోసం పనిచేసేవారిని చేయనివ్వదని అన్నారు.

 

ఇండియా కూటమిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. జూన్ 4 తర్వాత కూటమి జెండా ఎగరవేసేందుకు ఎవ్వరూ ఉండరని అన్నారు. కాంగ్రెస్ నేతలు తమ కుట్రలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. బీజేపీ పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతుందని పేర్కొన్నారు.

 

80 కోట్ల మంది పేద ప్రజలకు పక్కా గృహాలు, జన్ ధన్ ఖాతాలు మరియు ఉచిత ధాన్యం అందించామని అన్నారు. కేవలం ముస్లింలకు మాత్రమే కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ స్వంత ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. కూటమి నేతలు SC/ST/OBC రిజర్వేషన్లను ఎత్తివేసి ముస్లింలకు ఇస్తామని చెబుతున్నట్లు పేర్కొన్నారు.

 

మతం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లను రాజ్యాంగం వ్యతిరేకిస్తోందని చెప్పారు. అందుకే రాజ్యాంగాన్ని మార్చడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని అన్నారు. పదేళ్లలో ప్రజల అభివృద్ధి, భద్రత కోసం పని చేశామని చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ వారసత్వం మిగిల్చిన సమస్యలను పరిష్కరించామని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర రైతులను కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను బీజేపీ పాలనలో పూర్తి చేశామని తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |