ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తవుతోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. ఈ సమయంలో హైదరాబాద్ నగరాన్ని మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు చట్టం తెచ్చేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని అందులో కోరారు. కేంద్రాన్ని ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.
ఉమ్మడి రాజధానిగా: కేంద్ర ప్రభుత్వం మరో పదేండ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసేలా చట్ట రూపకల్పనకు ఉత్తర్వులు ఇవ్వాలని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 2034 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు తొమ్మిదవ షెడ్యూల్‌లోని కంపెనీలు, కార్పొరేషన్ల ఆస్తుల విభజన పూర్తి కాలేదని అందులో పేర్కొన్నారు. 2034 జూన్ 2వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా, కేంద్ర హోంశాఖకు ప్రతిపాదన పంపించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని అభ్యర్దించారు.
వివాదాలు తేలలేదు: ఈ పిల్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించడంతో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని వివరించారు.
రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, అంగీకారం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆస్తుల విభజన వివాదాలకు దారితీసిందని పేర్కొన్నారు. చట్టబద్ధమైన విధులు నిర్వర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో వివాదాలు పరిష్కారానికి నోచుకోలేదని పిటీషన్ లో ప్రస్తావించారు.
పదేళ్లు పొడిగించండి: పునర్విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో మొత్తం 91 కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయని పిటీషన్ గుర్తు చేసారు. 90 సంస్థల విషయంలో నిపుణుల కమిటీ ఒకే విధానాన్ని అనుసరించకపోవడంతో సిఫారసులను రాష్ట్రాలు అంగీకరించలేదన్నారు. సమస్యల పరిష్కారం పై కేంద్రం దృష్టి సారించకపోవడంతో వివాదాలు కోర్టుకు చేరుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలోనే వివాదాలు పరిష్కారం కావాని, లేకుంటే ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసారు.
విభజన హామీలు అమలు కానందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరే హక్కు ఏపీకి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని 2034వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు చట్టం తెచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటీషన్ లో కోరారు.