ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. పొత్తుల నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీలో బీజేపీ సీట్ల పైన కసరత్తు మొదలు పెట్టిండి. టీడీపీ, జనసేన ఇప్పటికీ బీజేపీ తమతో కలిసి వస్తుందని చెబుతున్నాయి. ఇటు జగన్ ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ సమయంలోనే సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. దీంతో, ఈ పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి మొదలైంది.
పొత్తుల లెక్కల వేళ: గత నెలలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పొత్తు చర్చలు మొదలయ్యాయి. మరుసటి రోజునే సీఎం జగన్ ప్రధానితో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. ఆ తరువాత పొత్తు పైన ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకు అధికారికంగా రాలేదు. ఇటు టీడీపీ, జనసేన తమ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటించాయి.
బీజేపీతో పొత్తు ఖాయమైన తరువాత మిగిలిన సీట్ల పైన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు – పవన్ స్పష్టం చేసారు. ఈ సమయంలో బీజేపీ ఆలోచన ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఈ రోజు లేదా రేపు పొత్తు పైన బీజేపీ నుంచి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఈ సమయంలోనే పాలనా పరమైన అంశాల పైన చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు.
ప్రధానితో జగన్ భేటీ: సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటుగా ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ పర్యటన అధికారిక టూర్ గా అధికారులు చెబుతున్నారు. గత పర్యటన సమయంలో పోలవరం కు అడహక్ నిధులు.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల పైన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
మరో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో ఈ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పోలవరం నిధులకు గతంలోనే జలశక్తి ఆమోద ముద్ర వేసి ఆర్దిక శాఖకు సిఫార్సు చేసింది. దీని పైన నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా సీఎం జగన్ కోరనునున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల పైన జగన్ చర్చించనున్నారు.
ఏం జరుగుతోంది: బీజేపీతో పొత్తు ఉంటుందని చెబుతున్నా..టీడీపీ, జనసేనలో మాత్రం ఫైనల్ గా బీజేపీ నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సీట్ల కేటాయింపుల పైన ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. పొత్తుపైన టీడీపీ, బీజేపీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన లేదు.
సీఎం జగన్ పలు సభల్లో టీడీపీకి రెండు జాతీయ పార్టీల్లో ఒకటి ప్రత్యక్షంగా..మరొకటి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్నాయని చెప్పుకొచ్చారు. కానీ, రాజకీయంగా మాత్రం చర్చలు మరో విధంగా ఉన్నాయి. దీంతో, ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ముందు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన..ఇటు పొత్తుల పైన నిర్ణయాల సమయం కావటంతో ఈ సారి జగన్ ఢిల్లీ పర్యటన మరింత ఆసక్తి పెంచుతోంది