బెంగళూరులోని రామేశ్వరం కేఎఫ్‌లో శుక్రవారం జరిగిన పేలుళ్ల ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తోపాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తునట్లు చెప్పారు. కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం జరిగినట్లు చెప్పారు.
మరోవైపు ప్రమాదానికి గ్యాస్ సిలిండర్ కారణం కాదని తేలటం వల్ల వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫెలో గ్యాస్ లీక్ అయినట్లు మధ్యాహ్నం 1.08గంటలకు సమాచారం అందినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. తమ అధికారులు, సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వచ్చే సరికి మంటలు లేవని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ తెలిపారు.
కేఫెలో ఆరుగురు కస్టమర్లతో కలిసి కూర్చున్న మహిళ వెనకాల బ్యాగ్ పేలిపోయిందన్నారు. హ్యాండ్‌బ్యాగ్‌లోని అనుమానిత పదార్థం వల్లనే పేలుడు జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ తెలిపారు. అయితే ఆ బ్యాగ్ ఎవరిది అనే విషయం తెలియదన్నారు.
గ్యాస్ సిలిండర్ వల్ల కచ్చితంగా పేలుడు జరగలేదన్నారు. తన బృందంతో కలిసి ఘటనాస్థలాన్ని పూర్తిగా పరిశీలించినట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ చెప్పారు. ఎక్కడా కూడా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయిన ఆనవాళ్లు లేవన్నారు. టీ, కాఫీ తయారీ కోసం వాడే మరో గ్యాస్ సిలిండర్‌ను కూడా పరిశీలించినట్లు చెప్పారు. దాని నుంచి కూడా గ్యాస్ లీక్ కాలేదన్నారు.