హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతుంది. ఈ డ్రగ్ పార్టీ కేసులో ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన డైరెక్టర్ క్రిష్ నిన్న సైబరాబాద్ పోలీసులు విచారణకు హాజరయ్యారు. అత్యంత గోప్యంగా ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆయనను విచారిస్తున్న క్రమంలో ఆయన నుండి రక్త మరియు మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు.
అయితే తను పార్టీకి వెళ్లిన మాట వాస్తవమేనని, డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని క్రిష్ చెబుతున్నారు. ఈ విషయంలో తను ఎలాంటి పరీక్షల కైనా సిద్ధంగా ఉన్నానని క్రిష్ స్పష్టం చేశారు. ఊహించని విధంగా నిన్న సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు, ఎవరి కంటా పడకుండా హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేషన్ కి వెళ్ళిన క్రిష్ మాదాపూర్ డిసిపి కార్యాలయానికి వెళ్లి అక్కడ డిసిపి తో గంటసేపు క్రిష్ మాట్లాడారు.
ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగం చేసినట్టు తనకు తెలియదని పేర్కొన్న క్రిష్, స్నేహితుడు రఘు చరణ్ తనకు ఫోన్ చేస్తే రాడిసన్ కు వెళ్లాలని, అక్కడ అరగంట మాత్రమే తాను ఉన్నానని చెప్పినట్టు సమాచారం. ఒక సినిమా చర్చల కోసం తన ముంబై వెళ్లానని, అందుబాటులో లేకపోవడం వల్లే విచారణకు హాజరు కాలేదని డైరెక్టర్ క్రిష్ తెలిపారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ కారణంగానే జరిగిన విషయం చెప్పడానికి వచ్చానని క్రిష్ డిసిపి కి వెల్లడించారు. అయితే డిసిపి మాత్రం డైరెక్టర్ క్రిష్ రక్త మరియు మూత్ర శాంపిల్స్ తీసుకొని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రిపోర్టులను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపిన డిసిపి, పోలీసులకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని, ఎప్పుడు పిలిచినా రావాలని డైరెక్టర్ క్రిష్ కు సూచించారు.
ఇదిలా ఉంటే రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ కేసులో హాజరు కావాలని డైరెక్టర్ క్రిష్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని,తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును విజ్ఞప్తి చేశారు. క్రిష్ బెయిల్ పిటిషన్ పైతమ వైఖరి తెలియజేయాలంటూ హైకోర్టు గచ్చిబౌలి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.