ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషించారనే ఆరోపణలపై వైసీపీ నేత అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో జైల్లో తన తండ్రిని పరామర్శించిన అనంతరం ఆయన కుమార్తె మౌనిక మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన బలాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకునే తమ ఇంటిపై కాపులు దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
తాము కూడా కాపు మహిళలమేనని, తమను పరుష పదజాలంతో తిడుతూ తమ ఇంటిపై దాడి చేస్తుంటే పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారని మౌనిక ప్రశ్నించారు. “మహిళల భద్రత గురించి మాట్లాడే పీకే గారూ.. ఇదేనా మీరన్న రక్షణ?” అంటూ నిలదీశారు. కాపు కులస్తులంతా పవన్ వైపు ఉన్నారనే ధీమాతోనే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. తమపై పక్కా ప్లాన్ ప్రకారమే కర్రలు, రాడ్లతో దాడి జరిగిందని, ఈ సమయంలో పోలీసులు కనీసం అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, మహిళల ఇళ్లపై దాడులు జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు గురించి తన తండ్రి అసభ్యంగా మాట్లాడలేదని, కేవలం తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలు మాట్లాడినందుకే ఈ దాడులకు ఉసిగొల్పారని మౌనిక పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డిని గతంలో చంద్రబాబు కూడా ఎన్నోసార్లు విమర్శించారని, ఇప్పుడు ప్రశ్నిస్తే మాత్రం దాడులు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.









