UPDATES  

NEWS

 విశాఖ భూములపై జగన్ ధ్వజం: చంద్రబాబు కుటుంబంపై రూ.5 వేల కోట్ల దోపిడీ ఆరోపణలు

విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం అధికార దుర్వినియోగంతో సుమారు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించిన ఆయన, రుషికొండ ప్రాంతంలోని 54.79 ఎకరాల భూమిని చంద్రబాబు తన బంధువు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు అక్రమంగా కట్టబెట్టారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్వాధీనం చేసుకున్న భూములను ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉచితంగా బహుమతిగా ఇచ్చిందని జగన్ విమర్శించారు.

ఈ భూ కేటాయింపు ప్రక్రియలో మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని జగన్ ఆరోపించారు. లోకేష్‌కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా, విద్యాశాఖ ద్వారా ప్రత్యేక మెమో జారీ చేయించి తన తోడల్లుడికి భూములు కేటాయించేలా చక్రం తిప్పారని ధ్వజమెత్తారు. ఈ నిర్ణయాన్ని ఆమోదించుకోవడానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లపై భౌతిక దాడులు చేయించారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీసీ మహిళా మేయర్‌ను తొలగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయని, అదే సమయంలో వారి కుటుంబ ఆస్తులు మాత్రం అమాంతం పెరుగుతాయని జగన్ విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ తమ పాలనను ప్రజా సేవగా కాకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు మరియు దేశం ఈ భూ దోపిడీని గమనించాలని, ఇది ఏపీ భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన తన “వేక్-అప్ కాల్” సందేశంలో పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |