UPDATES  

NEWS

 నేటితో ముగియనున్న మేడారం మహాజాతర..!

తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. వన దేవతలు సమ్మక్క-సారలమ్మ గద్దెలపైకి చేరుకోవడంతో.. మేడారం జన సంద్రంలా మారింది. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి గద్దెలపై కొలువు దీరిన అమ్మవార్లకు బంగారం(బెల్లం)తో మొక్కులు తీర్చుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 50 లక్షల మందికి పైగా భక్తులు వన దేవతలను దర్శించుకున్నారు. గత మూడు రోజులుగా 80 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క-సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.

 

భారీగా ట్రాఫిక్ జామ్

భక్తులు భారీగా తరలిరావడంతో.. తాడ్వాయి- మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే రహదారిలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా జాతరలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు తిరుగు ప్రయాణం అవుతున్నారు. శుక్రవారం పస్రా నుంచి తాడ్వాయి, మేడారం వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. వేల సంఖ్యలో వాహనాలు రెండున్నర గంటల పాటు రోడ్లపై చిక్కుకుపోయాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఇబ్బందులు సమస్య తప్పలేదు.

 

80 లక్షలకు పైగా భక్తులు

మేడారం మహాజాతర శనివారం సమ్మక్క వన ప్రవేశం ఘట్టంతో ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధవారం సారలమ్మ ఆగమనంతో ప్రారంభమైన జాతరకు గత మూడు రోజుల్లో 80 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రోజు కావడంతో భక్తుల రాక పెద్ద సంఖ్యలో ఉంటుందని అంటున్నారు.

 

నేటితో ముగియనున్న జాతర

మేడారం మహాజాతర జనవరి 28న ప్రారంభమై జనవరి 31తో ముగియనుంది. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్‌ జిల్లా పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరుకున్నారు. 29న చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను ప్రధాన గద్దెపై ప్రతిష్ఠించారు. శుక్రవారం నాడు నలుగురు భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ నలుగురు తిరిగి వన ప్రవేశం చేయడంతో మేడారం మహా జాతర ముగుస్తుంది. భక్తులు తిరుగు ప్రయాణం పట్టడంతో.. భారీగా రద్దీ నెలకొంది. భక్తుల రద్దీతో ఆర్టీసీ మరిన్నీ బస్సులను మేడారం జాతరకు నడుపుతుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |