ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు చేరుకున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలంలోని శాస్త్రీయ శిక్షణా కేంద్రంగా గుర్తింపు పొందిన అగస్త్య విద్యాచల్ అకాడమీలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దాదాపు రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన టీచర్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం, అనంతరం రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్, రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ శిక్షణా కేంద్రాలు ఏటా వేలాది మంది ఉపాధ్యాయులకు, విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నాయి.
ఈ సందర్భంగా అకాడమీలోని విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచించినప్పుడే సమాజంలో గొప్ప మార్పులు సాధ్యమవుతాయని, ఇన్నోవేషన్లే భవిష్యత్తుకు పునాది అని ఆయన పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలకు, స్టార్టప్ కంపెనీలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను యువత అందిపుచ్చుకోవాలని, ఐటీ రంగంలో తెలుగు వారు రాణించినట్లే ఏఐ (AI), డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లోనూ ముందుండాలని ఆకాంక్షించారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రకాల ఆధునిక సాంకేతికతలకు ప్రయోగశాలగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కుప్పం ప్రాంత అభివృద్ధి, నీటి భద్రతపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా కుప్పంకు కృష్ణా జలాలను తీసుకురావడం ద్వారా దశాబ్దాల కల నెరవేరిందని, ఈ సందర్భంగా ఆయన నీటి వద్ద హారతి ఇచ్చారు. నీటి సంరక్షణ మరియు సద్వినియోగం విషయంలో అగస్త్య అకాడమీ ప్రతినిధులు వినూత్నంగా ఆలోచించాలని, కుప్పంలోనే దీనిపై ఒక పైలెట్ ప్రాజెక్టును చేపడదామని పిలుపునిచ్చారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా విద్యుత్ ఛార్జీలను తగ్గించడం సాధ్యమైందని, రాబోయే రోజుల్లో ఏపీని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.









