కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహా జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ములుగు పోలీసులు కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను రంగంలోకి దించారు. దేశంలోనే ఒక భారీ జాతరలో ఈ స్థాయి టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ ఏఐ సాఫ్ట్‌వేర్, సాధారణ సీసీ కెమెరాల ద్వారా వచ్చే విజువల్స్‌ను విశ్లేషించి.. ఎక్కడైనా జనసందోహం మితిమీరినా లేదా తొక్కిసలాట జరిగే సూచనలు ఉన్నా వెంటనే కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తుంది.
ఈ భద్రతా వ్యూహంలో డ్రోన్ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి కేవలం నిఘాకే కాకుండా, కిలోమీటర్ల మేర నిలిచిపోయే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి పోలీసులకు సహాయపడుతున్నాయి. గాలిలో నుంచి వాహనాల రద్దీని గమనిస్తూ, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను సూచించేందుకు పోలీసులు వీటిని వాడుతున్నారు. అడ్వాన్స్‌డ్ ఏరియల్ సర్వైలెన్స్ ద్వారా జాతర ప్రాంగణం అంతా పోలీసుల కనుసన్నల్లోనే ఉంటోంది.
అన్నింటికంటే ముఖ్యంగా, ఈ టెక్నాలజీ తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ప్రాణవాయువులా పనిచేస్తోంది. జాతరలో తప్పిపోయిన పిల్లలు లేదా వృద్ధుల వివరాలను ‘ఫేషియల్ రికగ్నిషన్’ (ముఖ గుర్తింపు) ఫీచర్ ద్వారా డేటాబేస్‌లోని ఫోటోలతో సరిపోల్చి, వారిని త్వరగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. సంప్రదాయ భద్రతకు ఈ అత్యాధునిక సాంకేతికత తోడవడంతో తక్కువ సిబ్బందితో ఎక్కువ నిఘా ఉంచడం సాధ్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.









