తెలంగాణ హైకోర్టు పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంలో మంగళవారం (జనవరి 20, 2026) సంచలన తీర్పు వెల్లడించింది. రోడ్లపై వాహనదారులను ఆపి, పెండింగ్ చలాన్లు ఉన్నాయనే నెపంతో వారిని బలవంతం చేయవద్దని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించింది. ముఖ్యంగా వాహనాల తాళాలు (కీలు) లాక్కోవడం, వాహనాలను సీజ్ చేయడం లేదా అక్కడికక్కడే డబ్బులు కట్టాలని వేధించడం వంటి చర్యలు ఏమాత్రం సరికాదని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక అంశాలను ప్రస్తావించింది. వాహనదారులు తమంతట తాముగా, స్వచ్ఛందంగా చలాన్ల మొత్తం చెల్లిస్తామంటేనే పోలీసులు వసూలు చేయాలని సూచించింది. ఒకవేళ వాహనదారుడు చెల్లించడానికి ఇష్టపడకపోతే, చట్టపరమైన పద్ధతిలో నోటీసులు జారీ చేసి న్యాయప్రక్రియ ద్వారా ముందుకు వెళ్లాలని పేర్కొంది. ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక విధి నిబంధనలను పర్యవేక్షించడమే తప్ప, వసూళ్ల కోసం పౌరులను ఇబ్బంది పెట్టడం కాదని కోర్టు నొక్కి చెప్పింది.
సికింద్రాబాద్‌కు చెందిన వి. రాఘవేంద్ర చారి దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లను బ్యాంక్ ఖాతాల నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు వాహనదారులకు పెద్ద ఉపశమనంగా మారాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానా విధించే అధికారం న్యాయస్థానాలకే ఉంటుందని పిటిషనర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది.









