వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు మంగళవారం (జనవరి 20, 2026) కీలక విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమా? అని ప్రశ్నిస్తూ, ఒకవేళ అవసరమైతే ఎవరెవరిని విచారించాలనుకుంటున్నారో, ఎవరిని కస్టడీలోకి తీసుకోవాలనుకుంటున్నారో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసును ఇంకా ఎంతకాలం పొడిగిస్తారని, ఇలాగైతే మరో పదేళ్లయినా విచారణ పూర్తికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
వివేకా కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరిగింది. ట్రయల్ కోర్టు (సీబీఐ ప్రత్యేక కోర్టు) కేవలం ఇద్దరి పాత్రలకే పరిమితం చేస్తూ పాక్షిక దర్యాప్తునకు అనుమతించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. తాము పిటిషన్‌లో పేర్కొన్న కీలక అంశాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, కేవలం పరిమిత విచారణకు ఆదేశించడం న్యాయసమ్మతం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. దర్యాప్తు అధికారితో చర్చించి పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. దీనికి అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం, సీబీఐ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 5, 2026కు వాయిదా వేసింది. అప్పటికల్లా దర్యాప్తు పురోగతి మరియు తదుపరి ప్రణాళికపై నివేదిక ఇవ్వాలని సూచించింది.









