నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో సుమారు 20 నుంచి 30 డివిజన్లలో తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆశావహులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, స్థానిక రాజకీయ పరిస్థితులు మరియు గెలుపు అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మున్సిపల్ ఎన్నికల అధికారిక నోటిఫికేషన్ వెలువడక ముందే అభ్యర్థుల జాబితాను ఖరారు చేయాలని జాగృతి పట్టుదలతో ఉంది. తన సొంత గడ్డ అయిన నిజామాబాద్‌పై పట్టు సాధించి, రాజకీయంగా తన ఉనికిని చాటుకోవాలని కవిత వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో స్థానికంగా మంచి పట్టున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన ‘సింహం’ గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా కొందరు స్వతంత్ర అభ్యర్థులు ఇదే గుర్తుతో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో, ఈ గుర్తుతో ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో నిజామాబాద్ మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది.









