భార్య మరణాన్ని అంగీకరించిన విక్రాంత్ ఠాకూర్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు విక్రాంత్ ఠాకూర్ (42), తన భార్య సుప్రియ ఠాకూర్ (36) మృతికి తానే కారణమని కోర్టులో అంగీకరించాడు. గత ఏడాది డిసెంబర్ 21న అడిలైడ్‌లోని నార్త్‌ఫీల్డ్‌లో ఉన్న వారి నివాసంలో ఈ విషాద ఘటన జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న సుప్రియను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె మృతికి భర్తే కారణమని నిర్ధారించిన పోలీసులు విక్రాంత్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
మర్డర్ కాదు.. మాన్‌స్లాటర్ అంటూ వాదన ఇటీవల అడిలైడ్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగిన విచారణలో విక్రాంత్ వీడియో లింక్ ద్వారా హాజరై తన వాదనను వినిపించాడు. తాను తన భార్యను చంపిన మాట వాస్తవమేనని, అయితే అది ఉద్దేశపూర్వకంగా చేసిన ‘మర్డర్’ కాదని పేర్కొన్నాడు. పరిస్థితుల ప్రభావం వల్ల అనుకోకుండా జరిగిన ‘మాన్‌స్లాటర్’ (Manslaughter) కింద దీనిని పరిగణించాలని కోరాడు. అంటే, చంపాలనే ఉద్దేశం లేకపోయినా జరిగిన మరణంగా దీన్ని చూడాలని అతను కోర్టును అభ్యర్థించాడు. అయితే ప్రాసిక్యూటర్లు ఈ వాదనను అంగీకరించలేదు.
వాయిదా పడిన తదుపరి విచారణ ఈ కేసులో మరింత స్పష్టత రావాల్సి ఉందని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ముఖ్యంగా పోస్టుమార్టం నివేదికతో పాటు డీఎన్ఏ విశ్లేషణ, టాక్సికాలజీ రిపోర్టుల కోసం వేచి చూస్తున్నట్లు వెల్లడించింది. ఈ కీలక ఆధారాలు అందిన తర్వాతే కేసు ఏ దిశగా వెళ్తుందనేది స్పష్టమవుతుంది. దీంతో మేజిస్ట్రేట్ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది. అప్పటి వరకు నిందితుడు విక్రాంత్ కస్టడీలోనే ఉండనున్నాడు. ఈ కేసు త్వరలోనే సౌత్ ఆస్ట్రేలియా సుప్రీంకోర్టుకు బదిలీ కానుంది.









