తెలంగాణ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని తనకు వ్యక్తిగత బంధువు కాదని, దేశ ప్రధాని కాబట్టే ప్రాంతీయ అభివృద్ధి పనుల నిమిత్తం ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రాన్ని సంప్రదిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉన్నప్పటికీ, పాలనలో అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని, తనకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ముఖ్యమంత్రి ప్రత్యేక వరాల జల్లు కురిపించారు. ఈ ప్రాంతానికి ఇప్పటివరకు విశ్వవిద్యాలయం లేకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ, బాసరలో నూతన వర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అలాగే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం తీసుకువచ్చే బాధ్యత తనదేనని, ప్రధాని మోదీ చేతుల మీదుగానే దీనికి శిలాఫలకం వేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోకపోవడం వల్లే జిల్లా వెనుకబడిందని, ఇప్పుడు పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్‌కు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.
నీటి పారుదల రంగంపై దృష్టి సారించిన సీఎం, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ప్రతినబూనారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని, ఆదిలాబాద్‌లో ప్రతి నీటి చుక్కను ఒడిసి పడతామని హామీ ఇచ్చారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచే వారినే గెలిపించాలని కోరుతూ, ప్రజల మద్దతు ఉంటే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.









