ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ (హరిత ఇంధనం) రంగంలో ప్రపంచ స్థాయి హబ్‌గా ఎదగబోతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాకినాడ కేంద్రంగా సుమారు 10 బిలియన్ డాలర్ల (రూ.83,400 కోట్లు) భారీ పెట్టుబడితో ఒక మెగా ప్రాజెక్టు రాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఏపీ మరో సౌదీ అరేబియాగా అవతరిస్తుందని, ఇది రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్నే మార్చేస్తుందని ఆయన ట్విట్టర్ వేదికగా ధీమా వ్యక్తం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా సుమారు 8 వేల మంది యువతకు నేరుగా ఉపాధి లభించడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభించనుంది. కాకినాడ నుంచి తయారయ్యే హరిత ఇంధనం జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి కానుందని లోకేశ్ వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ మరియు అమోనియా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ తన ముద్ర వేయబోతోందని, తద్వారా విదేశీ పెట్టుబడులకు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను మరియు అధికారిక ఒప్పందాలను వెల్లడించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. “కాకినాడ నుంచి ప్రపంచానికి” అనే నినాదంతో వస్తున్న ఈ భారీ పరిశ్రమ గురించి నేడు సాయంత్రం 6 గంటలకు స్పష్టత రానుంది. ఈ నెల 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ పర్యటనకు రానుండటంతో, ఈ లోపే ప్రకటించిన ఈ భారీ ఇన్వెస్ట్‌మెంట్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.









