ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం అమరావతిలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ, జగన్‌కు నాగరికత గురించి తెలిస్తే నదుల పైన, రాజధాని అమరావతి పైన ఇలాంటి దుష్ప్రచారం చేయరని హితవు పలికారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్, ఢిల్లీ వంటి నగరాలన్నీ నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందాయన్న కనీస జ్ఞానం లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, అసలు సింధు నాగరికత ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని సూచించారు. నదీ గర్భం (River bed) మరియు నదీ పరివాహక ప్రాంతం (River basin) మధ్య తేడా తెలియకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
నీటి వనరుల వినియోగంపై స్పందిస్తూ, రెండు తెలుగు రాష్ట్రాలు నీటి కోసం గొడవ పడటం వల్ల తెలుగు ప్రజలే నష్టపోతారని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణతో సహకరించుకుంటూ మిగులు జలాలను వాడుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలను సుభిక్షం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని సమర్థవంతంగా తరలించడం వల్లే రాయలసీమలో ఉద్యానవన (హార్టికల్చర్) రంగం అద్భుతంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని గుర్తుచేశారు. రాబోయే పదేళ్లలో ఉద్యాన రంగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఎదగాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో 2020లో కేవలం మట్టి పనులు చేసి రూ. 900 కోట్ల బిల్లులు డ్రా చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రాజెక్టులను అటకెక్కించి రాయలసీమకు ద్రోహం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం హయాంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చూసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.









