UPDATES  

NEWS

 ట్రంప్‌కు నోబెల్ బహుమతి బదిలీ సాధ్యం కాదు: నోబెల్ కమిటీ స్పష్టత!

వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కోరినా మచాడో సంచలన ప్రకటన చేశారు. తనకు వచ్చిన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహుమతిగా ఇవ్వాలని ఆమె భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వెనిజులాలో నికోలస్ మదురో పతనం తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ట్రంప్ పట్ల తన గౌరవాన్ని చాటుకోవడానికి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, మచాడో ప్రతిపాదనను నార్వేజియన్ నోబెల్ కమిటీ తీవ్రంగా తోసిపుచ్చింది. నోబెల్ నిబంధనల ప్రకారం.. ఒకసారి ప్రకటించిన బహుమతిని వేరొకరికి బదిలీ చేయడం, పంచుకోవడం లేదా రద్దు చేయడం అసాధ్యమని కమిటీ స్పష్టం చేసింది. నోబెల్ గౌరవం అనేది వ్యక్తిగతమని, దానిని అధికారికంగా మరొకరికి బదిలీ చేసే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఈ నిబంధనలు శాశ్వతమని, ఇందులో ఎటువంటి మార్పులకు తావులేదని నోబెల్ కమిటీ వివరించింది.

మరోవైపు, మచాడో వచ్చే వారం అమెరికాలో పర్యటించి ట్రంప్‌ను కలవనున్నారు. మచాడో తన అవార్డును తనకు ఇవ్వాలనుకోవడంపై ట్రంప్ స్పందిస్తూ.. ఇది చాలా మంచి విషయమని, ఆమె అమెరికా పట్ల ఎంతో గౌరవంతో వస్తున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్ గతంలో కూడా తాను అనేక యుద్ధాలను ముగించానని, తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని పలుమార్లు బహిరంగంగా వాదించిన సంగతి తెలిసిందే. వెనిజులాలో మదురో వారసురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |