ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ర్యాలీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ జెండాలతో పాటు అనూహ్యంగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు, వైసీపీ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొని ‘జై కేటీఆర్ – జై జగన్’ అంటూ నినాదాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
బీఆర్ఎస్, వైసీపీ పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ ఘటనతో మరోసారి బహిర్గతమైంది. గతంలో రెండు రాష్ట్రాల్లో ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, జగన్ మధ్య అత్యంత స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పడానికి ఈ ర్యాలీ ఒక ఉదాహరణగా నిలిచింది. ఇటీవల తాడేపల్లిలో జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యంలో, ఇప్పుడు ఖమ్మంలో వైసీపీ జెండాలు కనిపించడం రెండు పార్టీల కేడర్ మధ్య ఉన్న సమన్వయాన్ని సూచిస్తోంది.
ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. సరిహద్దు జిల్లా కావడంతో ఖమ్మంలో ఏపీ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందుకే వైసీపీ కార్యకర్తలు కేటీఆర్ ర్యాలీకి మద్దతుగా నిలిచారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు లేదా రాజకీయ సహకారం ఏ విధంగా ఉండబోతుందనే దానిపై చర్చలు మొదలయ్యాయి.









