ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో మధ్యప్రదేశ్ రాష్ట్ర మాండ్లా ఎంపీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో జరుగుతున్న మైనింగ్ వ్యవహారాలపై కులస్తే ఫిర్యాదు చేశారు. అక్కడ గ్రానైట్ మైనింగ్ కోసం మధ్యప్రదేశ్ వాసులు చట్టబద్ధంగా అనుమతులు పొందినప్పటికీ, స్థానిక నాయకులు వారిని అడ్డుకుంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆయన పవన్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ ఫిర్యాదుపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందిస్తూ, అనుమతులు ఉన్న వారు నిబంధనల ప్రకారం మైనింగ్ చేసుకునేలా అధికార యంత్రాంగం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. “ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమేనని, ఏ రాష్ట్రం వారైనా ఎక్కడైనా పనులు చేసుకునే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని” ఆయన స్పష్టం చేశారు. స్థానికేతరుల పేరుతో పనులు అడ్డుకుంటే ఎంతటి వారైనా సరే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మైనింగ్ అంశంతో పాటు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ప్రాజెక్టుపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారు 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ప్రకృతి విపత్తుల నుండి రక్షించడానికి 5 కిలోమీటర్ల వెడల్పుతో పచ్చదనాన్ని పెంపొందించాలని, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను జనవరి నెలాఖరులోపు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా, అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకోవడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.









