సిరిసిల్లలోని అపారెల్ పార్కును సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.400 కోట్లతో, 25 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఈ పార్కును ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయిందని, గతంలో తాము తెచ్చిన రెండు పరిశ్రమలు తప్ప అక్కడ మరేమీ లేవని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నేత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేత కార్మికుల సంక్షేమం కోసం తాము ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. సంక్రాంతి పండుగలోపు ఈ పథకం కింద లబ్ధిదారులను ప్రకటించాలని, లేనిపక్షంలో 10 వేల మంది కార్మికులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని రోడ్డున పడేస్తోందని ధ్వజమెత్తారు.
అంతకుముందు, కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసి యువతలో ఉత్సాహాన్ని నింపారు.









