ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఉత్తాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకం కింద కొత్త విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (PPA) ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ 31తో నిలిపివేయాలని కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అంటే, 2026 కొత్త ఏడాది నుంచి రైతులు ఈ పథకం కింద కొత్తగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉండదు. తెలంగాణలో ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న టీజీ రెడ్కో (TG REDCO) ఇప్పటికే ఈ మేరకు చర్యలు చేపట్టింది.
ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా విద్యుత్ కొనుగోలు ధరల సమస్య కనిపిస్తోంది. ప్రస్తుతం రైతులకు కేటాయించిన ప్లాంట్ల నుండి యూనిట్ విద్యుత్‌ను రూ. 3.13 చొప్పున కొనుగోలు చేయాలని గతంలో నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సౌర విద్యుత్ ధరలు యూనిట్‌కు రూ. 3 కంటే తక్కువకే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ ధర వెచ్చించి రైతుల నుంచి విద్యుత్ కొనడం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలపై (డిస్కంలు) అదనపు ఆర్థిక భారం పడుతుందని కేంద్రం మరియు రాష్ట్ర డిస్కంలు భావిస్తున్నాయి. ఈ ధరల వ్యత్యాసం వల్లే కొత్త అగ్రిమెంట్ల విషయంలో వెనకడుగు పడింది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుమారు 1,450 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ల కోసం ఒప్పందాలు పూర్తి చేయగా, రెండో దశ కింద మరో 20 వేల మెగావాట్ల కోసం కేంద్రాన్ని కోరింది. అయితే దీనిపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రాబోయే మూడేళ్లలో 3 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని సిద్ధమవుతోంది. ఈ టెండర్లలో వచ్చే అతి తక్కువ ధరను ప్రామాణికంగా తీసుకుని, భవిష్యత్తులో రైతులకు ఇచ్చే ధరను సవరించే అవకాశం ఉంది. అప్పటివరకు కొత్త అగ్రిమెంట్లకు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది.









