UPDATES  

NEWS

 స్టేజ్‌పై స్టెప్పులేసిన మల్లారెడ్డి కోడలు: నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సాంగ్ లాంచ్‌లో హంగామా!

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ‘రాజు గారి పెళ్ళిరో’ అనే లిరికల్ సాంగ్ విడుదల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేడుకలో భాగంగా ఆమె హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి పాటలోని స్టెప్పులను అనుకరిస్తూ డ్యాన్స్ చేయడంతో విద్యార్థులు ఈలలు, కేకలతో కాలేజీ ప్రాంగణాన్ని హోరెత్తించారు.

ఈ సందర్భంగా ప్రీతి రెడ్డి మాట్లాడుతూ నవీన్ పోలిశెట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన నవీన్ ఎంతోమంది యువతకు ఆదర్శమని ఆమె పేర్కొన్నారు. గాడ్ ఫాదర్ లేని వారికి ఎదుగుతుంటే అడ్డుకునే వారు చాలా మంది ఉంటారని, కానీ వాటన్నింటినీ అధిగమించి సక్సెస్ సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీ మరియు ఎనర్జీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సంక్రాంతి బరిలో వస్తున్న ఈ ‘రాజు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |