ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల అరాచక పాలన వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయినా ఇంకా రౌడీయిజం చేయాలనుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు. “నువ్వు నీ ఇంట్లో పెద్ద నాయకుడివి కావచ్చేమో కానీ, బయట నీ పప్పులు ఉడకవు” అంటూ జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. చట్టాన్ని అతిక్రమించి అల్లర్లు సృష్టించాలని చూస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక రాజకీయ సంస్కృతిపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో మరియు బయట కనిపిస్తున్న “రప్పారప్పా” సంస్కృతిని, జంతువులను బలిచ్చి పోస్టర్లపై రక్తం చల్లడం వంటి వికృత చేష్టలను ఆయన తప్పుబట్టారు. ఇటువంటి చర్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, ఇవి రాజకీయాలు కావని దుయ్యబట్టారు. కేవలం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాజకీయం చేయాలనుకునే వారు తమ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో రౌడీయిజం, గూండాగిరీ చేసే వారికి తావు లేదని, అటువంటి వారు పద్ధతి మార్చుకోకపోతే ‘రాష్ట్ర బహిష్కరణ’ చేయడానికైనా వెనుకాడబోమని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని, విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధమైన, ప్రశాంతమైన పాలనను సుస్థిరం చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.









