సమాజానికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పిన ఘటన ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేటలో సంచలనం సృష్టించింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. మారుతి నగర్‌లో నివసించే లక్ష్మణ్ నాయక్ భార్య పద్మకు ఇటీవల డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆమెకు మరో పాఠశాలలో పనిచేసే గోపి అనే ఉపాధ్యాయుడితో ఏర్పడిన అక్రమ సంబంధమే ఈ ఘోరానికి దారితీసింది.
వీరిద్దరి వ్యవహారం భర్త లక్ష్మణ్ నాయక్‌కు తెలియడంతో ఆయన భార్యను మందలించారు. దీంతో తమ సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన పద్మ, గోపి.. గత నెల 24న లక్ష్మణ్ నిద్రిస్తున్న సమయంలో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం పద్మ ఏమీ తెలియనట్లుగా పాఠశాలకు వెళ్లి, తన భర్త ఫోన్ ఎత్తడం లేదని ఇంటి యజమానితో కలిసి నాటకమాడింది. లక్ష్మణ్ గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.
అయితే, లక్ష్మణ్ సోదరుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు పద్మ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించారు. ఆమె గోపితో తరచూ మాట్లాడుతున్నట్లు గుర్తించి, తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, క్షుద్రానందం కోసం నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.









