నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై సీపీ సజ్జనార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే ఈవెంట్లలో రాత్రి 10 గంటలకే సౌండ్ సిస్టమ్‌లను నిలిపివేయాలని, శబ్ద కాలుష్యంపై ఫిర్యాదులు వస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఈవెంట్ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి అని, అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మహిళల భద్రత కోసం పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం 15 షీ టీమ్స్ (She Teams) బృందాలను మఫ్టీలో రంగంలోకి దింపనున్నట్లు సీపీ వెల్లడించారు. వేడుకల సాకుతో మహిళలను వేధించినా లేదా అసభ్యంగా ప్రవర్తించినా తక్షణమే అరెస్టులు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా పబ్బులు, ఫామ్ హౌస్‌లు మరియు బహిరంగ సభల వద్ద నిఘా తీవ్రతరం చేయనున్నారు.
డిసెంబర్ 31 రాత్రి 9 గంటల నుంచే నగరవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమవుతాయి. అన్ని ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లు మరియు జంక్షన్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని సీపీ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకాలని ఆయన కోరారు.









