ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోస్గి వేదికగా సంచలన శపథం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఎవరూ మళ్లీ అధికారంలోకి రాకుండా చూస్తానని, ఇది కొడంగల్ బిడ్డగా తన సవాల్ అని ప్రకటించారు. గతంలో కేసీఆర్ తనను జైలుకు పంపించి, తన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఇప్పుడు బీఆర్ఎస్ అనేది గతమని, భవిష్యత్తు అంతా కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే 2029 ఎన్నికలపై రేవంత్ రెడ్డి జోస్యం చెబుతూ.. కాంగ్రెస్ పార్టీ 80కి పైగా సీట్లు సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి అసెంబ్లీ స్థానాలు 153కు పెరిగితే, కాంగ్రెస్ 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, పాలమూరు ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని “తోలు తీస్తా” అని కేసీఆర్ విమర్శించడం ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవానికి తగదని రేవంత్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ ప్రస్తుతం తన ఫాంహౌస్‌ను బందీఖానాగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 29 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకావాలని, అక్కడ ఏ అంశంపై అయినా చర్చించడానికి తాము సిద్ధమని సవాల్ విసిరారు. పార్టీ కార్యాలయాల్లో ప్రెస్‌మీట్‌లు పెట్టడం మానేసి, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సూచనలు చేయాలని సూచించారు.









