రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2024తో పోలిస్తే 2025 సంవత్సరంలో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. గతేడాది 28,626 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 33,040కి చేరిందని ఆయన వివరించారు. మహిళలపై నేరాలు సుమారు 4 శాతం పెరిగాయని, ఈ ఏడాది మొత్తం 330 అత్యాచార కేసులు, 1,224 పోక్సో (POCSO) కేసులు మరియు 579 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
సైబర్ నేరాల అదుపునకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ఏడాది 3,734 సైబర్ కేసులు నమోదు కాగా, 6,188 మంది నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ మోసాలకు గురైన బాధితులకు ఊరటనిస్తూ, సుమారు రూ.40.10 కోట్లను రిఫండ్ చేయించగలిగామని సీపీ తెలిపారు. అలాగే, ఈ ఏడాది మొత్తం 21,056 కేసులను పరిష్కరించామని, 12 కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కోర్టుల ద్వారా కృషి చేశామని వివరించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా రాచకొండ పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.20 కోట్ల విలువైన మత్తు పదార్థాలను పట్టుకుని, 668 మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో 495 మంది డ్రగ్స్ రవాణా కేసుల్లో ఉన్నారని, వీరిలో తెలంగాణకు చెందిన వారు 322 మంది కాగా, ఇతర రాష్ట్రాల వారు 172 మంది మరియు ఒక విదేశీయుడు కూడా ఉన్నారని సీపీ సుధీర్‌బాబు స్పష్టం చేశారు.









