UPDATES  

NEWS

 స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టులో తేల్చుకుంటామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద!

తెలంగాణలో ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ ఒక ట్రిబ్యునల్ చైర్మన్‌గా తన బాధ్యతలను నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిరాయింపులను బాహాటంగా సమర్థిస్తున్నారని, దానికి అనుగుణంగానే స్పీకర్ ఈ తీర్పు ఇచ్చారని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని, ఆ పార్టీ ఫ్లెక్సీల్లో కనిపిస్తున్నా.. వారు పార్టీ మారలేదని స్పీకర్ తీర్పు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని వివేకానంద అన్నారు. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి పనిచేశారని ఆయన గుర్తుచేశారు. కేవలం సుప్రీంకోర్టు హెచ్చరికల వల్ల, న్యాయస్థానం నుండి ఎదురుదెబ్బ తగులుతుందనే భయంతోనే హడావిడిగా ఈ తీర్పును వెలువరించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం తమకు జడ్జిమెంట్ కాపీని వెంటనే అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కడియం శ్రీహరి, దానం నాగేందర్ వంటి కీలక నేతలపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని వివేకానంద తప్పుబట్టారు. తెలంగాణ స్పీకర్ కార్యాలయం తన వ్యవహారశైలితో అత్యున్నత న్యాయస్థానంలో రాష్ట్ర పరువు తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఐదుగురిపైనే తీర్పు ఇచ్చి, మిగిలిన ఐదుగురిపై సమాధానం దాటవేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |