UPDATES  

NEWS

 ఇళ్లు, పంచాయతీ నిధులు కాంగ్రెస్ సొత్తు కాదు: ఎమ్మెల్యేల బెదిరింపులపై కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖానాపూర్, షాద్ నగర్ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, కాంగ్రెస్ నేతల బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని వారికి భరోసా ఇచ్చారు.

ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. “అవి మీ అబ్బ సొత్తు కాదు.. మీ అత్త సొత్తు కాదు. రేవంత్ రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తున్నారా?” అని ఆయన మండిపడ్డారు. ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచులకే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఎవరి భిక్ష కాదని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వాటికి స్వయం ప్రతిపత్తి ఉందని కేటీఆర్ గుర్తుచేశారు.

కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన రూ. 3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ఎన్నికలు జరిపిందని ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే రావాలని, ఆ నిధులను ఆపే హక్కు ఏ ముఖ్యమంత్రికి గానీ, ఎమ్మెల్యేకు గానీ లేదన్నారు. అంతేకాకుండా, “ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు” అని పార్టీ శ్రేణులకు ధీమా వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |