ఆధార్ కార్డు అవసరాల దృష్ట్యా, యూఐడీఏఐ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, మంచానికే పరిమితమైన వారు ఆధార్ నమోదు లేదా అప్‌డేట్ కోసం కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్దకే ఆధార్ సేవలను అందించే విధానాన్ని అధికారులు ప్రారంభించారు. ఈ కొత్త సౌకర్యం ద్వారా ఆధార్ సేవలు మరింత సులభతరం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఈ ఇంటి వద్ద ఆధార్ సేవలు పొందాలంటే, ముందుగా వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులో సంబంధిత వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితి, ఆధార్ అప్‌డేట్ అవసరం వంటి పూర్తి వివరాలను పొందుపరచాలి. ముఖ్యంగా, కార్యాలయానికి రాలేని పరిస్థితిని స్పష్టంగా చూపించే ఫోటోతో పాటు, వైద్యులు జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్‌ను కూడా జతచేయాలి.
దరఖాస్తు అందిన తర్వాత యూఐడీఏఐ సిబ్బంది సుమారు ఏడు రోజుల పాటు పరిశీలన చేపడతారు. అనంతరం, ప్రత్యేక సిబ్బంది ఇంటికే వచ్చి ఆధార్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేసి, సమస్యలను పరిష్కరిస్తారు. ఈ ఇంటి వద్ద ఆధార్ సేవలకు దూరం ఎంత ఉన్నా సంబంధం లేకుండా రూ.700 ఫీజు వసూలు చేస్తామని అధికారులు తెలిపారు.









