పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన విశాఖపట్నం, ఇప్పుడు టెక్నాలజీ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో బలమైన ఐటీ పర్యావరణ వ్యవస్థను (ఎకో సిస్టం) నిర్మిస్తున్నామని, అందులో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలు విశాఖకు తరలివస్తున్నాయని ఆయన తెలిపారు. శుక్రవారం నాడు విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ కీలక ప్రకటన చేశారు.
ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాగ్నిజెంట్ తొలుత 8 వేల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. అయితే శంకుస్థాపన కార్యక్రమానికి ముందు సీఈఓ రవికుమార్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు, విశాఖ యువత కోసం ఉద్యోగాల సంఖ్యను 25 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కోరికను మన్నించిన రవికుమార్, 25 వేల ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ వేదికపైనే ప్రకటించారు. కాగ్నిజెంట్ సంస్థ మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో ఈ అత్యాధునిక క్యాంపస్‌ను నిర్మించనుంది. ఈ క్యాంపస్‌లో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ వంటి భవిష్యత్ సాంకేతికతలపై దృష్టి సారించనున్నారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, “మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌లో ఐటీకి పునాదులు వేశాం. ఆ విజన్ కారణంగానే నేడు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగానే విశాఖను నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం” అని అన్నారు. కాగ్నిజెంట్‌తో పాటు ఆరోజు టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ సహా మరో 8 ఐటీ కంపెనీల కార్యకలాపాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి అదనంగా రూ.3,740 కోట్ల పెట్టుబడులు, 41,700 ఉద్యోగాలు లభించనున్నాయి.









