హైదరాబాద్‌లోని సినీ ప్రేక్షకులకు అల్లు సినిమాస్ శుభవార్త అందించింది. దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా (Dolby Cinema) స్క్రీన్‌ను నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ భారీ థియేటర్‌ను ప్రేక్షకులకు సరికొత్త వీక్షణ అనుభూతిని అందించే లక్ష్యంతో సిద్ధం చేస్తున్నారు. ఈ సరికొత్త డాల్బీ స్క్రీన్ ఏకంగా 75 అడుగుల వెడల్పుతో ఉండనుంది.
ఈ స్క్రీన్‌లో అత్యుత్తమ విజువల్స్ కోసం డాల్బీ విజన్, డాల్బీ 3డీ ప్రొజెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు, ప్రేక్షకులను కథలో పూర్తిగా లీనం చేసే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను జతచేస్తున్నారు. వీక్షకులకు ఎలాంటి ఆటంకం లేకుండా సినిమాను ఆస్వాదించేందుకు వీలుగా ‘పిచ్-బ్లాక్ స్టేడియం సీటింగ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ టెక్నాలజీల కలయిక సినిమా చూసే అనుభవాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లనుంది.
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి అయిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా ప్రదర్శనతో ఈ సరికొత్త డాల్బీ స్క్రీన్‌ను ప్రారంభించాలని అల్లు సినిమాస్ యోచిస్తోంది. డిసెంబరు 19న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం కోసం భారతీయ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఈ సరికొత్త థియేటర్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని నగరవాసులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.








