పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీల వైఖరిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర హక్కుల గురించి, విభజన హామీల గురించి ఎంపీలు నోరు మెదపడం లేదని, ప్రధాని మోదీ ప్రసంగాలకు చప్పట్లు కొడుతూ బుద్ధిమంతులుగా కూర్చుంటున్నారని ఆమె విమర్శించారు. విభజన జరిగి 11 ఏళ్లు గడుస్తున్నా, కేంద్రం ఇచ్చిన హామీలలో పది శాతం కూడా అమలు చేయలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజన హామీలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన 5 లక్షల కోట్ల రూపాయల చెక్కు లాంటివని, అది చేతిలో ఉన్నా దాన్ని ఎన్‌క్యాష్ చేసుకోలేకపోతున్నామని షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎంపీలకు సొంత ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని, వారికి మోదీ మెప్పు ముఖ్యమని మండిపడ్డారు. ఏపీలోని ఎంపీలంతా వేరు వేరు పార్టీలకు చెందినవారైనా, నిజానికి బీజేపీకి బినామీలుగా, మోదీ చేతుల్లో రబ్బర్ స్టాంపులుగా మారిపోయారని, బీజేపీ బిల్లులకు గొర్రెల్లా తల ఊపుతున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రానికి 25 మంది లోక్‌సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి ముఖ్యమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని షర్మిల ఎంపీలను డిమాండ్ చేశారు. ఎంపీలలో ప్రవహించేది తెలుగువాడి రక్తమే అయితే, ఓట్లు వేసిన ప్రజలపై కృతజ్ఞతాభావం ఉంటే నోరు విప్పాలని ఆమె కోరారు.








