దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ భర్త, సీనియర్ న్యాయవాది మరియు మిజోరం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ (73) ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమార్తె, ఢిల్లీ బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ధృవీకరిస్తూ భావోద్వేగ నివాళి అర్పించారు. “మీ ఆప్యాయత, క్రమశిక్షణ, దేశభక్తి… నా జీవితానికి ఎప్పటికీ వెలుగునిస్తాయి. ఇప్పుడు మీరు అమ్మతో కలిసి భగవంతుని సన్నిధిలో శాశ్వత శాంతితో ఉంటారనే నమ్మకం నాకుంది” అని బన్సూరి తన పోస్టులో పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని లోధీ రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
1952 జులై 12న జన్మించిన స్వరాజ్ కౌశల్, ప్రముఖ క్రిమినల్ లాయర్‌గా పేరుగాంచారు. రాజకీయాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 1990 నుంచి 1993 వరకు మిజోరం గవర్నర్‌గా సేవలందించిన ఆయన, 1998 నుంచి 2004 వరకు హర్యానా వికాస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. ఆయన న్యాయవాదిగా తన కెరీర్‌లో ఎమర్జెన్సీ సమయంలో బరోడా డైనమైట్ కేసులో సోషలిస్ట్ నేత జార్జ్ ఫెర్నాండెజ్ తరఫున వాదించి గుర్తింపు పొందారు.
స్వరాజ్ కౌశల్ అత్యంత ముఖ్యమైన సేవల్లో ఒకటి – మిజోరం శాంతి ఒప్పందంలో ఆయన కీలక పాత్ర పోషించడం. ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై నిపుణుడిగా ఉన్న ఆయన కృషి ఫలితంగా 1986లో మిజోరం శాంతి ఒప్పందం కుదిరి, ఆ ప్రాంతంలో దాదాపు 20 ఏళ్ల తిరుగుబాటుకు ముగింపు పలికింది. ఆయన మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం తెలిపారు.









