తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ (BRS) మరియు దాని అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఓ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుందని, ఇప్పుడు ఆ కుటుంబంలో అక్రమ సొమ్ము కోసం గొడవలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. “బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, ఆయన ఎక్కడ పడుకున్నారో ఎవరికీ తెలియదు” అంటూ కేసీఆర్ కుటుంబాన్ని ఎద్దేవా చేశారు. ప్రజలను దోచుకున్న వారు చరిత్రలో బాగుపడలేదని, ప్రస్తుతం వారింట్లో జరుగుతోంది పైసల పంచాయితీ తప్ప మరొకటి కాదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అదే వేదికపై, లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలేశ్వరంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అనంతరం, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ప్రజలకు ముఖ్యమైన సూచన చేశారు. ప్రజలు గొడవలు సృష్టించే వారిని పక్కన పెట్టి, మంత్రులతో మాట్లాడి గ్రామాలకు నిధులు తెచ్చే మంచి నాయకులను సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అడ్డగోలుగా ఖర్చు చేయవద్దని, ఆ ఖర్చుకు సరిపడా ఆదాయం కూడా రాదని ఆయన ప్రజలకు సూచించారు.
“మంచివారిని ఎన్నుకోండి, నిధులిచ్చే బాధ్యత మాదే” అని రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. తాము కేంద్రం వద్దకు వెళ్లి నిధులు తెచ్చుకున్నట్లుగానే, సర్పంచ్‌లు కూడా మంత్రుల వద్దకు వెళ్లి గ్రామ అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకోగలగాలని అన్నారు. విద్యార్థులు ఎన్నికలు అంటూ తిరగకుండా బాగా చదువుకుని, ఐపీఎస్, ఐఏఎస్, డాక్టర్లు కావాలని, అప్పుడే తాను సంతోషంగా ఉంటానని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.









