సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బనాయించిన అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తమ పార్టీ నేతలపై కేసులు పెడితే కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాన్ని ఆయన కొనియాడారు, వారికి తెలంగాణ ప్రజలంతా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన షేర్ క్యాపిటల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదిలీ చేసి, పత్రిక సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా లేదని, నాయకులు ఎవరూ జేబులో సొమ్ము వేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నీ నెహ్రూవేనని ఆయన వ్యాఖ్యానించారు.
వారసత్వంగా ఉన్న పత్రికను నడపాలనే మంచి ఉద్దేశంతో సోనియా గాంధీ పునరుద్ధరణ ప్రక్రియ చేపడితే, దానిపై మనీలాండరింగ్ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయినప్పటికీ, సోనియా, రాహుల్ గాంధీలు మానసిక ధైర్యం కోల్పోకుండా కేసులను ఎదుర్కొన్నారని ఆయన ప్రశంసించారు.









