సినీ రచయిత, నటుడు, దర్శకుడు అయిన ఎల్బీ శ్రీరామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆధునిక సమాజం, కుటుంబ వ్యవస్థ, మరియు సినిమాల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో తాను రొటీన్ కామెడీ వేషాలు వేయలేక కొంత గ్యాప్ తీసుకున్నానని, అయితే తన సంతృప్తి కోసం షార్ట్ ఫిలిమ్స్ మాత్రం చేస్తూనే ఉన్నానని ఆయన తెలిపారు.
కుటుంబ కథా చిత్రాలు రావడం లేదనే విమర్శలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “కుటుంబ కథా చిత్రాలు రావడానికి అసలు కుటుంబాలు ఎక్కడున్నాయి?” అని ప్రశ్నించారు. ఈ రోజుల్లో పెద్దవారిని శరణాలయాలలో చేర్పించడం, పిల్లలను హాస్టల్స్‌లో ఉంచడం జరుగుతోందన్నారు. భార్యాభర్తలు కూడా డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అంటూ ఒకరినొకరు చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి తీరికలేనంత బిజీగా ఉంటున్నారని, ఇదంతా దేనికోసమో అర్థం కావడం లేదన్నారు.
“ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతకంటే ఎక్కువ సెల్ ఫోన్స్ ఉంటున్నాయి” అని ఎల్బీ శ్రీరామ్ వ్యాఖ్యానించారు. పెద్దవాళ్లు చెప్పే పరిస్థితులలో లేరు, పిల్లలు వినే స్థితిలో లేరని అన్నారు. పిల్లలను విదేశాలకు పంపించడం కోసమే చదివిస్తున్నారని, విదేశాలకు వెళ్లిన పిల్లలు, వారిని పంపించిన తల్లిదండ్రులు ఇద్దరూ అవస్థలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా కుటుంబాలు చాలా అస్తవ్యస్థమై పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.









