ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమపై, రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. “గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయింది,” మరియు “తెలంగాణ నాయకుల నర దిష్టి తాకడం వల్లే కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి” వంటి పవన్ వ్యాఖ్యలపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఎప్పుడూ ఏపీ సంక్షేమాన్నే కోరుకుంటుందని, రాష్ట్ర విభజనను అభివృద్ధికి అడ్డంకి అనడం అవమానకరమని అనిరుధ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతూ పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. “పవన్ కల్యాణ్.. నువ్వు 70 ఏళ్లు వచ్చినా కూడా ముఖ్యమంత్రి కాలేవు. నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు. నీకు దమ్ముంటే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి ఒంటరిగా పోటీ చెయ్” అని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రజలకు నర దిష్టి ఉంటే, హైదరాబాద్‌లో ఏపీ ప్రజలు వ్యాపారాలు చేసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి కూడా వ్యాపారం చేసుకునేది, ఉండేది మాత్రం తెలంగాణలోనే కదా అని నిలదీస్తూ, తమకు నర దిష్టి ఉంటే ఇక్కడ ఆస్తులు ఎందుకు కొంటున్నారని సవాల్ విసిరారు.
“తెలంగాణ ప్రజల గురించి తప్పుగా మాట్లాడితే సహించబోం” అని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పవన్ కళ్యాణ్‌కు అభిమానినే అయినప్పటికీ, ఆయన తప్పు మాట్లాడాడు కాబట్టి తప్పేనని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ తక్షణమే భేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.









