హైదరాబాద్ నగరం గత దశాబ్దాలుగా ఎవరి కృషి లేకుండానే సహజంగా అభివృద్ధి చెందుతూ కోటి మందికి పైగా జనాభాతో మెగా సిటీగా మారింది. గతంలో కేవలం జంట నగరాలకే (హైదరాబాద్, సికింద్రాబాద్) పరిమితమైన అభివృద్ధి, 1995 తర్వాత ఐటీ పరిశ్రమల విస్తరణతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో సైబరాబాద్ పేరుతో వందల కిలోమీటర్లు విస్తరించింది. ఇది ప్రభుత్వానికి భారీగా పన్నుల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది, కోకాపేట్‌లో ఏకంగా ఎకరం భూమి ₹175 కోట్లు పలికిన రికార్డు ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ నలువైపులా విస్తరించే అవకాశం ఉండటంతో, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిరంతరం వృద్ధి చెందుతోంది.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత, హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీని ప్రతిపాదించారు. మెట్రో సేవలను ఈ ఫోర్త్ సిటీ వరకు విస్తరించగలిగితే, దాని పరిధిలోని ఆరు మండలాలకు (చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం, ఘట్ కేసర్, శేరిలింగంపల్లి) గొప్ప దశ పట్టనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను సేకరించి, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్తగా వచ్చే ఐటీ పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ఇక్కడే భూములు కేటాయించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
ప్రభుత్వం ఫోర్త్ సిటీని ప్రకటించిన వెంటనే, ఆ ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వెలిశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హయాంలో ఈ ఫోర్త్ సిటీని అభివృద్ధి చేసి చరిత్రలో నిలిచిపోవాలని భావించి, వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా, గత రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి, ఫోర్త్ సిటీ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులతో కూడా చర్చించారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే, హైదరాబాద్ ఫోర్త్ సిటీని ఆపడం ఎవరి తరమూ కాదనే అభిప్రాయం రియల్ ఎస్టేట్ వర్గాల్లో బలంగా ఉంది.









