UPDATES  

NEWS

 ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు: మృతి వదంతులను ఖండించిన జైలు అధికారులు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన వదంతులను రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇమ్రాన్ ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, ప్రస్తుతం తమ వద్దే ఉన్నారని, ఆయన్ను ఎక్కడికీ తరలించలేదని గురువారం స్పష్టం చేశారు. “ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, అవసరమైన పూర్తి వైద్య సంరక్షణ అందిస్తున్నాం” అని జైలు అధికారులు ప్రకటించారు.

ఈ వదంతులపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని, అలాగే ఇమ్రాన్‌తో ఆయన కుటుంబ సభ్యుల భేటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ సోదరీమణులను ఆయన్ను కలిసేందుకు అనుమతించకపోవడంతోనే ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.

తన సోదరుడిని కలిసేందుకు అనుమతించకపోవడంతో ఇమ్రాన్ సోదరీమణులు అలీమా ఖాన్, నూరీన్ ఖాన్, ఉజ్మా ఖాన్ మంగళవారం అడియాలా జైలు బయట గంటల తరబడి నిరసన కూడా చేపట్టారు. “లోపల ఏం జరుగుతోందో ఎవరికి తెలుసు? బహుశా ఇమ్రాన్‌ను వేరే చోటుకు తరలించి ఉండవచ్చు. అందుకే మమ్మల్ని కలవనివ్వడం లేదు” అని అలీమా ఖాన్ అనుమానం వ్యక్తం చేస్తూ, దేశంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అవినీతి, ఉగ్రవాదం వంటి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |