పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఆడియాలా జైలులో రహస్యంగా హత్య చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో (Social Media) తీవ్ర ప్రచారం జరుగుతోంది. ఈ వదంతుల నేపథ్యంలో, ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు – నూరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ – మరియు పాక్ తహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) నేతలు రావల్పిండిలోని ఆడియాలా జైలు వద్దకు చేరుకుని, ఇమ్రాన్‌ను కలవనివ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే, పోలీసులు తమపై క్రూరంగా దాడి చేశారని ఇమ్రాన్ సోదరీమణులు ఆరోపించారు. బలూచిస్థాన్ విదేశాంగ శాఖ కూడా తమ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఇమ్రాన్‌ను చంపేసినట్లు వార్తలు వస్తున్నాయని పోస్ట్ చేయడం ఈ వదంతులకు మరింత ఆజ్యం పోసింది. అయితే, అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటనా రాలేదు.
నూరీన్ నియాజీ మాట్లాడుతూ, ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనతో తాము శాంతియుతంగా నిరసన చేసినప్పటికీ, ఆ ప్రాంతంలో స్ట్రీట్ లైట్లు ఆర్పేసి, పంజాబ్ పోలీసు సిబ్బంది తమపై క్రూరంగా దాడి చేశారని అన్నారు. “నా వయస్సు 71 ఏళ్లు. నా జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టేసి రహదారి మీదకు లాగేశారు, గాయాలు అయ్యాయి” అని ఆమె ధ్వజమెత్తారు. జైలు బయట ఉన్న ఇతర మహిళలను కూడా పోలీసులు చెంపదెబ్బలు కొట్టి లాగేశారని ఆమె చెప్పారు. తమపై జరిగిన ఈ హింస క్రూరమైందని, ముందస్తు ప్రణాళికలో భాగంగా దాడి చేశారని పేర్కొంటూ, వారు పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వార్‌కు లేఖ రాశారు.
ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి ఆడియాలా జైలులో అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయనను మూడు వారాలుగా కలవనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన సోదరీమణులు తెలిపారు. ఈ కారణంగానే తాము ప్రశాంతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదికి కూడా ఇమ్రాన్‌ను కలుసుకునేందుకు వరుసగా ఏడు సార్లు ప్రయత్నించినా జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు. జైలు అధికారులు ఒక సైనిక అధికారి నియంత్రణలో ఉన్నారని ఇమ్రాన్ ఖాన్ గతంలో ఆరోపించారు.









