చేజారిన జూబ్లీహిల్స్ పక్కనే ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల కారణంగా అనర్హత వేటు తప్పదన్న చర్చ నేపథ్యంలో, ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని బీఆర్‌ఎస్ (BRS) పట్టుదలతో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న బీఆర్‌ఎస్, ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసితో బలమైన అభ్యర్థి కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.
బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న బీఆర్‌ఎస్, దివంగత నేత పీజేఆర్ తనయుడు మరియు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని రంగంలోకి దించాలని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. పీజేఆర్ తనయుడిగా విష్ణుకు ఖైరతాబాద్‌లో ఇప్పటికే ఉన్న ఫాలోయింగ్‌తో దానం నాగేందర్‌కు గట్టి పోటీ ఇవ్వగలరని గులాబీ పార్టీ నమ్ముతోంది. గతంలో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన విష్ణు, ఈసారి ఖైరతాబాద్ ఉపఎన్నిక వస్తే పోటీ చేయించడానికి పార్టీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వీరితో పాటు, మన్నె గోవర్ధన్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన, ఈసారి తనకు లేదా తన భార్య మన్నె కవిత (ప్రస్తుతం వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్)కు ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అలాగే, బీసీ ఈక్వేషన్‌లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేరును కూడా బీఆర్‌ఎస్ పరిశీలిస్తోంది. జూబ్లీహిల్స్ మాదిరిగా కాకుండా, ఖైరతాబాద్‌లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ, బలమైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది.









